8, ఆగస్టు 2021, ఆదివారం

జరుగుతున్నది జగన్నాటకం పాట లిరిక్స్ - Jaruguthunnadi Jagannaatakam Song Lyrics in Telugu - Krishnam Vande Jagadgurum (2012) Telugu Songs Lyrics













చిత్రం : కృష్ణం వందే జగద్గురుమ్ (2012)

సంగీతం : మణిశర్మ 

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం






జరుగుతున్నది జగన్నాటకం .. జరుగుతున్నది జగన్నాటకం ..

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం

నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం

జరుగుతున్నది జగన్నాటకం .. జరుగుతున్నది జగన్నాటకం ..

 

చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని

ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని

సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి

నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం


చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే

పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే

బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక

ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమథన మర్మం


ఉనికిని నిలిపే యిలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును

కరాళ దంష్ట్రుల కుళ్ళగించి యీ ధరాతలమ్మును ఉధ్ధరించగల

ధీరోధ్ధతి రణ హుంకారం ఆదివరాహపు ఆకారం

 

ఏడీ ఎక్కడరా నీ హరి ? దాక్కున్నాడేరా భయపడి ?

బయటకి రమ్మనరా .. ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి ?

నువు నిలిచిన యీ నేలని అడుగు .. నీ నాడుల జీవ జలమ్ముని అడుగు

నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు

నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరునీ హరినీ కలుపు

నీవే నరహరివని నువు తెలుపు


ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి

హంతృ సంఘాత నిర్ఘృణ నిబడమే జగతి

అఘము నగమై ఎదిగె అవనికిదె అశనిహతి

ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి

శితమస్తి హత మస్తకారి నఖ సమకాసియో

కౄరాసి గ్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయు మహిత యజ్ఞం


అమేయమనూహ్యమనంత విశ్వం.. 

ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం .. 

కుబ్జాకృతిగా బుధ్ధిని భ్రమింపజేసే.. అల్పప్రమాణం

ముజ్జగాలనూ మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం 


జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం

జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నాటకం


పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ

పరశురాముడై .. భయదభీముడై .. పరశురాముడై భయదభీముడై

ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన శోత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు


ఏ మహిమలూ లేక యే మాయలూ లేక నమ్మశక్యముగాని యే మర్మమూ లేక

మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి

సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే


ఇన్ని రీతులుగా యిన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్నపరిచితునిగా

దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము


అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా

ఈశత్వముగా వశిత్వమ్ముగా నీలోని అష్ట సిధ్ధులూ నీకు కన్పట్టగా

స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా


నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా

తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతె నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే


వందే కృష్ణం జగద్గురుమ్ వందే కృష్ణం జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్

వందే కృష్ణం జగద్గురుమ్ వందే కృష్ణం జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి